మెదక్ జిల్లాలో 999 డబుల్ ఇండ్ల పంపిణీకి కసరత్తు .. అర్హులను గుర్తించేందుకు అధికారుల సర్వే

మెదక్ జిల్లాలో 999 డబుల్ ఇండ్ల పంపిణీకి కసరత్తు .. అర్హులను గుర్తించేందుకు అధికారుల సర్వే
  •  ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో లబ్ధిదారులకు కేటాయించే యోచన 
  • మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో గతంలో 2,369 డబుల్ ఇండ్లు మంజూరు.

మెదక్, వెలుగు: మెదక్ జిల్లాలో గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో మిగిలిన 999 ఇండ్లను పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈక్రమంలో అర్హులను గుర్తించేందుకు అధికారులు సర్వే చేపట్టారు. ఈ సర్వేలో పట్టణాలు, గ్రామాల్లో ఎన్ని ఇండ్లు, ఏ స్థాయిలో  ఉన్నాయో గుర్తిస్తున్నారు. వీటిని ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 డేస్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు  చేస్తున్నారు. 

అర్హులకు ఇండ్లు ఇచ్చేందుకే.. 

పేదలందరికీ పక్కా ఇండ్లు కట్టించేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. కాగా గత ప్రభుత్వ హయాంలో నిర్మించి డబుల్ బెడ్రూం ఇండ్లు కొన్నింటిని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వాటిలో కొన్ని అసంపూర్తిగా ఉండడంతో పంపిణీ చేయలేదు. ఈక్రమంలో వాటిని కూడా పూర్తి చేసి అర్హులకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రజా పాలనలో ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అర్హుల గుర్తింపు కోసం మున్సిపల్, రెవెన్యూ అధికారుల సర్వే చేపట్టారు. ఇంటికోసం దరఖాస్తు చేసిన వారికి సొంత ఇళ్లు ఉందా? లేదా? కిరాయికి ఉంటున్నారా? అనేది గుర్తిస్తున్నారు. ఈ సర్వే ఆధారంగా అర్హులైన వారికి ఇళ్ళను కేటాయించనున్నారు. 

మెదక్​ జిల్లాలో గత సర్కార్ హయాంలో 2,369 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు  మంజూరు కాగా అందులో 1,622 పూర్తయ్యాయి.  వాటిలో 1,114  ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. మిగిలిన వాటిలో 164 ఇండ్లు ప్లాస్టరింగ్​ స్థాయిలో, 222 గోడల స్థాయిలో,  105 ఇండ్లు రూఫ్​ లెవల్​లో, 92 బేస్మెంట్​ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 92 పునాదుల స్థాయిలో ఉన్నాయి. 121 ఇండ్ల పనులు మొదలు కాలేదు. 

జిల్లా కేంద్రమైన మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 950 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా అందులో 840 నిర్మించగా..  వీటిలో 589 పంపిణీ చేశారు. వివిధ దశల్లో ఉన్న 251 ఇండ్లను పంపిణీ చేయనున్నారు. నర్సాపూర్  పట్టణంలో 500 ఇండ్లు మంజూరు కాగా 400 నిర్మాణం చేపట్టారు.

అందులో 252 పూర్తికాగా 148  వివిధ దశల్లో ఉన్నాయి. చేగుంటలో పూర్తయిన 108 ఇండ్లు, బోనాల కొండాపూర్ లో  47, నిజాంపేట మండలం చల్మెడలో పూర్తయిన 40, కల్వకుంటలో పూర్తయిన 72, చిన్న శంకరంపేట మండలం కొర్విపల్లిలో 8, రామాయంపేట పట్టణంలో 55, శివ్వంపేట మండలం దొంతిలో 18 ఇండ్లు కలిపి జిల్లా వ్యాప్తంగా మొత్తం 999 ఇండ్లు  పంపిణీ
 చేయనున్నారు. 

సర్వే తుది దశకు చేరుకుంది 

గతంలో మంజూరై వివిధ దశల్లో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేసేందుకు అర్హులను గుర్తించేందుకు చేపట్టిన సర్వే తుది దశకు చేరుకుంది. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేస్తాం. ఇప్పటివరకు జరిగిన నిర్మాణానికి పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ పెట్టిన వ్యయం ఎంత అయిందనేది లెక్క గట్టి, అది పోను మిగతా పనుల పూర్తికి అయ్యే డబ్బులు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

-మాణిక్యం, హౌసింగ్​పీడీ, మెదక్​ -